గొర్లవీడులో తల్లిపాలపై అవగాహన కార్యక్రమం
అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్ మందల లావణ్య
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గొర్లవీడు-1 అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్ మందల సరోజన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మందల లావణ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మందల లావణ్య మాట్లాడుతూ పుట్టిన ప్రతి శిశువుకు గంటలోపు తల్లిపాలు పట్టించాలని, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. అనంతరం రెండేళ్ల వయస్సు వరకు అనుబంధ పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం వల్ల పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
ఏఎన్‌ఎం మాట్లాడుతూ తల్లిపాలలో శిశువుకు అవసరమైన పోషకాలు, రోగనిరోధక శక్తి సమృద్ధిగా ఉంటాయని వివరించారు.
అనంతరం గర్భిణీలు, బాలింతలకు బాలామృతం, గుడ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు సుజాత, వసంత, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
