తిరువూరు అభివృద్ధికి మరో కీలక అడుగు..

  • మధిర రోడ్డు–పీటీ కొత్తూరు వరకు నాలుగు లేన్ల రహదారికి ప్రతిపాదన..
  • యూసీఎఫ్ నిధులతో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు చర్యలు..
  • ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సమావేశం…
  • అనుమతులు వేగవంతం చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు విజ్ఞప్తి

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు పట్టణంలో ఆధునిక రహదారి మౌలిక వసతుల కల్పనకు మరో కీలక అడుగు పడింది. మధిర రోడ్డు నుంచి పీటీ కొత్తూరు వరకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) నిధులతో నాలుగు లేన్ల రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఈ పనులకు సంబంధించి అవసరమైన అనుమతుల మంజూరు కోసం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రోడ్లు,భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్‌తో సమావేశమై చర్చించారు.

ఈ సందర్భంగా ప్రతిపాదిత అభివృద్ధి పనులను తిరువూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టేందుకు అవసరమైన పరిపాలనా, సాంకేతిక అనుమతులను త్వరితగతిన మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. పట్టణంలో పెరుగుతున్న రాకపోకలకు అనుగుణంగా విశాలమైన రహదారులు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

తిరువూరును ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, సురక్షితమైన రహదారులు, ఆధునిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తిరువూరు పట్టణ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.