భద్రాచలం వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక
- 49.5 అడుగులకు చేరిన నీటిమట్టం..
- అప్రమత్తమైన యంత్రాంగం
- పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరదనీరు..
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 49.5 అడుగులకు చేరుకోవడంతో జిల్లా కలెక్టర్ అంకిత్ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో 14 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి కారణంగా చర్ల–వెంకటాపురం రహదారిలో ఆలుబాక వద్ద రోడ్డుపైకి వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చర్ల–భద్రాచలం మార్గంలోని దుమ్ముగూడెం మండలంలో గంగోలు, పర్ణశాల ప్రాంతాల్లో కూడా రహదారులపైకి వరదనీరు చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూనవరం రహదారిలోని మురుమూరు వద్ద కూడా రోడ్డుపైకి నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మూడో ప్రమాద హెచ్చరికపై ఆందోళన..
గోదావరి నీటిమట్టం మరింత పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరితే చర్ల మండలం కుదునూరు వద్ద కూడా రహదారిపైకి నీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు మరింత కష్టతరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట వరదల మాన్యువల్ ప్రకారం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ భద్రాచలం కరకట్ట, బాలయ్య ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.
వరద సమాచార కేంద్రం ఏర్పాటు
వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐటీడీఏలో ప్రత్యేక వరద సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంత ప్రజలు 7995268352, 08743-232444, 7981219425 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
