సామర్థ్య నిర్మాణంతో మెరుగైన పాలన లక్ష్యం..
సామర్థ్య నిర్మాణంతో మెరుగైన పాలన లక్ష్యం..
అధికారులకు ప్రత్యేక స్ట్రెస్ మేనేజ్‌మెంట్ సెషన్లు
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంపు, సమర్థవంతమైన పరిపాలన లక్ష్యంగా అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సెషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
ఒత్తిడి లేని పనివాతావరణంలో నైపుణ్యాల సమర్థ వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్‌డీ) సెల్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పై వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సైకాలజిస్టులు డా. జి. శంకర్ రావు, డా. టీఎస్ రావు, బి. నవితశ్రీ, వై. జ్యోతికృష్ణ బృందం పాల్గొని రోజువారీ విధుల్లో ఒత్తిడిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. ఒత్తిడికి కారణాలు, భౌతిక, ఉద్వేగ, ప్రవర్తనా లక్షణాలు, పని ఒత్తిడి నివారణ మార్గాలు, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌పై సెషన్ ఉత్సాహభరితంగా సాగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులు తమ సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విధానాల అమలు, ప్రజా సేవల మెరుగుదల, కార్యనిర్వహణలో సమన్వయం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
సిబ్బందిలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత పనితీరు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, డిజిటల్ స్కిల్స్ పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.
