కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం

కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు.విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలో అందించే విద్యా కానుక కిట్‌ను ఈసారి సమయానికి ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. యూనిఫామ్‌లు, షూలు, బ్యాగులు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేయడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. జూన్ 12న స్కూల్స్ ప్రారంభమైనా విద్యా కానుక అందించలేమని సమగ్ర శిక్ష అధికారులు ప్రకటించడం బాధాకరమన్నారు.

పాఠ్యపుస్తకాల పంపిణీపై కూడా స్పష్టత లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని అన్నారు. “పుస్తకాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం” అనే స్థాయికి ప్రభుత్వం దిగజారడం దౌర్భాగ్యకరమని పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో స్కూల్ ప్రారంభమైన మొదటి రోజే విద్యా కానుక కిట్ విద్యార్థుల చేతికి చేరేదని గుర్తుచేశారు. కానీ రెండేళ్లలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితులను సాకుగా చూపుతూ షూలు, బ్యాగులు, యూనిఫామ్‌లు ఇవ్వలేమని చెప్పడం హాస్యాస్పదమని దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు.

ఇప్పటికే రెండేళ్లుగా నాడు-నేడు పనులను నిలిపివేసి ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల విద్యా కానుక పథకానికే ఎర్త్ పెట్టిందని విమర్శించారు.పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నాటికి అందిస్తామని చెప్పడం ద్వారా ప్రభుత్వం తన అసమర్థతను ఒప్పుకుందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా వెంటనే విద్యా కానుక కిట్, పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply