దివంగత నేతలపై దుష్ప్రచారం తగదు

దివంగత నేతలపై దుష్ప్రచారం తగదు
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఆరోపణలు : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి
ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రభ : దివంగత నేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నా కనీసం సంజాయిషీ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడం రాజకీయ అక్కసుకు నిదర్శనమని విమర్శించారు. “నాన్న వైఎస్సార్, తాత రాజారెడ్డి ఈ లోకంలో లేరు. సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై దుష్ప్రచారం చేయడం ద్వారా టీడీపీ తమ రాజకీయ ద్వేషాన్ని బయటపెడుతోంది” అని వ్యాఖ్యానించారు.
వైఎస్ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు నిజమైతే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.
చెప్పుకోదగ్గ పాలనా విజయాలు లేకపోవడంతోనే ఈ తరహా ఆరోపణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజారెడ్డి పేదల పక్షాన నిలిచిన వ్యక్తి అని పేర్కొంటూ, 1973లోనే కడప ప్రజల కోసం 70 పడకల ఆసుపత్రిని నిర్మించి ఉచిత వైద్యం అందించారని గుర్తు చేశారు. డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాలలను స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించారని తెలిపారు.
అలాంటి వ్యక్తి చరిత్రను వక్రీకరించి చూపించడం రాయలసీమ ప్రజలు సహించరని హెచ్చరించారు. సంక్షేమం, అభివృద్ధికి చిరునామా వైఎస్సార్ అని పేర్కొంటూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఆయన పాలనలోనే అమలయ్యాయని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఐదేళ్లలో 33 శాతం పురోగతి సాధించారని, అనంతరం రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 వంటి హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
“బురద జల్లాలని చూసినంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గదు. అలాగే మహానేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో ఉన్న స్థానం చెరగదు” అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మరణవార్త విని వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి పూజాగదిలో ఆయనకు స్థానం దక్కిందని పేర్కొన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా ప్రజల హృదయాల్లో వైఎస్సార్ స్థానాన్ని ఎవరూ చెరపలేరని స్పష్టం చేశారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు తగ్గడానికి వైఎస్సార్ కృషే కారణమని పేర్కొంటూ, అవగాహన లేకుండా దివంగత నేతలను విమర్శించడం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి తగదని అన్నారు. ప్రజలకు మేలు చేసే పాలనపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
