లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

పెండింగ్ కేసుల పరిష్కారంతో అందరికి మేలు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

గోదావరిఖని, ఆంధ్రప్రభ : లోక్ అదాలత్‌ల ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, పెండింగ్ కేసుల పరిష్కారంతో సమయం, ధనం ఆదా అవుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 20న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై దర్యాప్తులో ఉన్న, అలాగే కోర్టు విచారణలో ఉన్న కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఐపీసీకి సంబంధించిన 637 కేసులు, ప్రత్యేక చట్టాలకు (ఎస్‌ఎల్‌ఎల్) సంబంధించిన 46 కేసులు పరిష్కరించబడ్డాయని తెలిపారు. అలాగే ఈ-పెట్టి కేసులు 3,097, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2,809, విపత్తు నిర్వహణ చట్టానికి సంబంధించిన ఈ-పెట్టి కేసులు 2 కలిపి మొత్తం 6,545 కేసులు పరిష్కరించామని వివరించారు. సైబర్ నేరాలకు సంబంధించిన 83 కేసుల్లో బాధితులకు రూ.73,67,714 తిరిగి అందజేసినట్లు తెలిపారు. ఇందులో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 76 సైబర్ కేసుల్లో బాధితులకు రూ.27,35,072, సీసీఎస్ పోలీస్ స్టేషన్ రామగుండంలో నమోదైన 7 కేసుల్లో బాధితులకు రూ.46,32,647 తిరిగి అందజేసినట్లు పేర్కొన్నారు.

లోక్ అదాలత్ ద్వారా పెట్టి కేసులు, ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర స్వల్ప చట్టపరమైన కేసులు వేగంగా పరిష్కారమయ్యాయని తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారంతో ప్రజలకు సమయం, ధనం ఆదా అయ్యాయని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసుల పరిష్కారానికి సహకరించారని, పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని సీపీ పేర్కొన్నారు.

గత 15 రోజులుగా కమిషనరేట్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లోని పక్షాలను స్వయంగా కలిసి, రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్‌లో సత్వర న్యాయం పొందవచ్చని అవగాహన కల్పించడంతో నిర్దేశించిన లక్ష్యానికి మించి కేసులు పరిష్కరించగలిగామని తెలిపారు. ప్రతిరోజూ పర్యవేక్షణ నిర్వహించిన అధికారులు, కృషి చేసిన సిబ్బందికి త్వరలో రివార్డులు అందజేస్తామని చెప్పారు. జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించిన రెండు జోన్ల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవా సంస్థలకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు కోర్టు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.