ద్వితీయ దశ ప్రవేశాలకు 15లోగా దరఖాస్తు చేసుకోవాలి

ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో ప్రవేశాలపై ప్రిన్సిపాల్ రమేష్ సూచనలు

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో ద్వితీయ దశ ప్రవేశాలకు ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ ప్రిన్సిపాల్ వై. రమేష్ గురువారం తెలిపారు.

ఇప్పటివరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రతితో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 8 నుంచి 17 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని సూచించారు.

మొదటి దశలో దరఖాస్తు చేసి సీటు పొందని అభ్యర్థులు మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారు వెబ్ ఆప్షన్లను తిరిగి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

10వ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. 10వ తరగతి, 8వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

2026 ఆగస్టు 1 నాటికి అభ్యర్థి కనీసం 14 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలని చెప్పారు.

అత్యాధునిక కోర్సులు, ఆధునిక ప్రయోగశాలలు, జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉచిత శిక్షణతో పాటు ప్రముఖ కంపెనీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

పూర్తి వివరాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ప్రభుత్వ ఐటీఐని సంప్రదించాలని ప్రిన్సిపాల్ వై. రమేష్ సూచించారు.