పొందుగల, చండ్రగూడెంలో ఈదురుగాలుల బీభత్సం

పొందుగల, చండ్రగూడెంలో ఈదురుగాలుల బీభత్సం

  • బాధితులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భరోసా
  • కూటమి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ

మైలవరం, ఆంధ్రప్రభ ; మైలవరం మండలం పొందుగల గ్రామంలో వీచిన భీకర ఈదురుగాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం గ్రామంలో పర్యటించారు. ఈదురుగాలుల ధాటికి నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న ఇళ్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పలు రేకుల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో నిరాశ్రయులైన కుటుంబాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరామర్శించారు.

ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు ఎమ్మెల్యే వసంత భరోసా ఇచ్చారు. వెంటనే నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు ఇళ్ల నష్టాన్ని లెక్కించి తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం విపత్తు సమయంలో ప్రజలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

ప్రజలు అధైర్యపడవద్దని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ధైర్యం చెప్పారు. అకాల వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ సమయంలో ప్రజలకు వెన్నంటే ఉండి రేయింబవళ్లు సేవలు అందించిన కూటమి నేతల కృషిని ప్రశంసించారు. విపత్తు సమయంలో కొందరు నాయకులు యుద్ధప్రాతిపదికన స్పందించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మైలవరం, ఆంధ్రప్రభ ; మైలవరం మండలం చండ్రగూడెం గ్రామంలో ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం ధాటికి తీవ్ర నష్టం వాటిల్లింది. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం గ్రామంలో పర్యటించి నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బలమైన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపోవడంతో పేద కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారికి జరిగిన నష్టం స్వయంగా చూసి చలించిపోయారు. రెప్పపాటులో ప్రాణాపాయం ముప్పు తప్పిందని వృద్ధులు తెలిపారు.

కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాధితులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు హామీ ఇచ్చారు. వెంటనే ఇళ్ల నష్టం అంచనా వేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో, ఆపద కాలంలో ప్రజలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం మీకు తోడుగా ఉందని భరోసా ఇచ్చారు. నష్టపరిహార నివేదికను వెంటనే జిల్లా కలెక్టర్‌ గారికి పంపాలని అధికారులకు తెలిపారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply