Indrakeeladri | కనకదుర్గమ్మకు కాసుల వర్షం..

రూ.3.48 కోట్ల హుండీ ఆదాయం..
అమ్మవారికి బంగారం వెండి ఆభరణాల బహుకరణ..


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మకు కాశీలో వర్షం కురిసింది. గురువారం నిర్వహించిన ఆలయంలోని అన్ని హుండీల లెక్కింపులో గత 15 రోజుల ఆదాయం రూ.3,48,25,362గా నమోదైంది. జూలై 22 నుంచి ఆగస్టు 6 వరకు భక్తులు సమర్పించిన కానుకల్లో 318 గ్రాముల బంగారం, 3.800 కిలోల వెండి లభించాయి. నగదు రూపంలో కరెన్సీ నోట్లు రూ.3,32,30,362, నాణేలు రూ.15,95,000 లభించగా, మొత్తం నగదు రూ.3,48,25,362గా నమోదైంది.

రోజువారీ సగటు హుండీ ఆదాయం రూ.23,21,690.80గా దేవస్థానం వెల్లడించింది. హుండీలో అమెరికా డాలర్లు, యూఏఈ దిర్హామ్‌లు, మలేషియా రింగిట్‌లు, సింగపూర్ డాలర్లు, యూరోలు, ఇంగ్లండ్ పౌండ్లు, సౌదీ రియాల్స్, కువైట్ దినార్‌లు, ఖతార్ రియాల్స్, భూటాన్ న్గుల్ట్రమ్, ఒమాని బైసా, హాంకాంగ్ డాలర్లు, శ్రీలంక రూపాయలతో పాటు పలు విదేశీ కరెన్సీలు కూడా భక్తులు సమర్పించారు. అలాగే పాత నోట్లలో రూ.2,000 విలువైన 7 నోట్లు హుండీలో లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే శీనా నాయక్ ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు సిబ్బంది ఎస్పీఎఫ్ వన్ టౌన్ పోలీసులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.