మైలవరంలో అందుబాటు ధరలో బీపీటీ బియ్యం..
- విక్రయాలకు శ్రీకారం
మైలవరం, ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన తక్కువ ధరకే బియ్యం విక్రయాల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజలపై ధరల భారాన్ని తగ్గిస్తూ నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది.
ఈ పథకం కింద బీపీటీ స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు, బీపీటీ గ్రేడ్-1 పచ్చి బియ్యాన్ని కిలో రూ.50కు విక్రయిస్తున్నారు. ప్రతి కుటుంబం నెలకు 10 కిలోల వరకు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. రైతు బజార్లు, రైస్ మిల్ అవుట్‌లెట్ల ద్వారా ఈ బియ్యాన్ని విక్రయిస్తున్నారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఇదే రకం బియ్యం కిలో రూ.60 నుంచి రూ.62 వరకు విక్రయమవుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.50–52కే అందుబాటులోకి తీసుకురావడం విశేషమని అధికారులు తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు మైలవరం రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని మైలవరం మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ పొనకళ్ల నవ్యశ్రీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ ధరియా, సివిల్ సప్లయిస్ డీటీ నాగరాజు, తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు శీలం బ్రాహ్మయ్య, టీడీపీ టౌన్ అధ్యక్షుడు షేక్ కరీం, మండల కార్యదర్శి ఆకుతోట ఈశ్వర్, మహిళా నాయకులు పసుపులేటి రేణుక, షేక్ షాహినా బేగం, జనసేన గ్రామ అధ్యక్షులు మెరుగు నాగేశ్వరరావు (నాని), తోట మాధవరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
