స్మార్ట్ సిటీ దిశ‌గా క‌ర్నూలు అభివృద్ధి : రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజ‌న‌రీ లీడ‌ర్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో క‌ర్నూలును అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. మంత్రి టీజీ భ‌ర‌త్ పుట్టిన‌రోజు వేడుక‌లు క‌ర్నూలులో ఘ‌నంగా జ‌రిగాయి. ముందుగా ఆయ‌న దేవాదాయ‌శాఖ గోశాల‌లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం బుధ‌వార‌పేట‌లో స్థానిక నాయ‌కులు అబ్బాస్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుచేసిన ర‌క్త‌దాన శిబిరాన్ని మంత్రి టీజీ భ‌ర‌త్ ప్రారంభించారు. అనంత‌రం మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేశారు.

ఎస్‌.ఏ.పీ క్యాంపు రోడ్డు ప్రారంభం..

బ‌ళ్ళారి చౌర‌స్తా వ‌ద్ద ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని హైద‌రాబాద్ నుండి వ‌చ్చే వాహ‌నాలు ఎస్‌.ఏ.పీ క్యాంపు మీదుగా కొత్త బ‌స్టాండ్ వైపు మళ్లించేందుకు నూత‌నంగా ఏర్పాటుచేసిన రోడ్డును మంత్రి టీజీ భ‌ర‌త్ ప్రారంభించారు. శిలాఫ‌లాకాన్ని ఆవిష్క‌రించి అనంత‌రం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ క‌ర్నూలు న‌గ‌రాన్ని స్మాట్ సిటీ చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగా న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. కోటిన్న‌ర రూపాయ‌ల‌తో ఈ రోడ్డు నిర్మాణం చేప‌ట్టామ‌న్నారు. ఇందుకు స‌హ‌క‌రించిన వారంద‌రికీ ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అనంతరం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన బర్త్డే వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, ఆయ‌న అభిమానులు త‌ర‌లివ‌చ్చి మంత్రికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డి టీజీ భ‌ర‌త్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఆ త‌ర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ మొక్కలు నాటారు. అనంత‌రం కంటి ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంత‌రం సిటీ స్క్వేర్ మాల్‌లో ఏర్పాటుచేసిన రక్త‌దాన శిబిరాన్ని ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం చ‌ల్లా కంపౌండ్‌లో ఆధార్ సేవా కేంద్రాన్ని ఆయ‌న ప్రారంభించారు.