పేదల ఇళ్ల పేరుతో అక్రమాలు చేసిన వారిని వదిలేది లేదు
- ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
దెందులూరు, ఆంధ్రప్రభ : అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోచుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.
బుధవారం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణాల పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించడం, తప్పుడు బిల్లులు సృష్టించడం, డ్వాక్రా మహిళల రుణాలను దుర్వినియోగం చేయడం, సిమెంట్, ఇనుము, ఇసుక కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, నివేదికల ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామని హెచ్చరించారు.
ప్రజల సొమ్మును దోచుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వ నిధులను కాపాడటంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, డీఈ వివేకానంద, గృహ నిర్మాణ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
