భీమ్‌గల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
డిజిటల్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: చైర్మన్ బోదిరే నాగమణి
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ (బాలికల) ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు కంప్యూటర్ల వినియోగం, డిజిటల్ విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కంప్యూటర్ ల్యాబ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
పాఠశాలలో కంప్యూటర్ విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ఈ ల్యాబ్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని భవిష్యత్తులో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈవో డి. స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వృత్తి విద్య (వొకేషనల్) అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
