భాకరాపేటలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’కు శ్రీకారం
- ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే పులివర్తి నాని..
- సంక్షేమ పథకాల అమలుపై ఆరా
- రూ.2 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడి
చంద్రగిరి, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం’ కార్యక్రమం తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పంచాయతీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నాయకత్వం వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ప్రతి ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు అందుతోందా లేదా అని ఆరా తీశారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి పథకాల అమలు తీరుపై అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు.
అలాగే పంచాయతీలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే, ఇంకా పరిష్కారం కావాల్సిన స్థానిక సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
భాకరాపేట పంచాయతీ అభివృద్ధి కోసం ఇప్పటికే చేపట్టిన పనులతో పాటు రూ.2 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించి, వాటికి సంబంధించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవడం ద్వారా వారి సమస్యలను తెలుసుకుని, వేగంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
