ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా మీడియా ఉండాలి
ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా మీడియా ఉండాలి
.అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.
.సమన్వయంతోనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు
.అధికారులు–మీడియా మధ్య సమాచార లోపం ఉండొద్దు
.అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంలో మీడియా పాత్ర కీలకం
.మీడియాతో జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి ముఖాముఖి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరాలంటే మీడియా కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.
శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. జిల్లాలో చేపడుతున్న జలధార–జలహారతి కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు, రాబోయే ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు–ఎరువుల అందుబాటు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, మీడియాతో అధికారుల సమన్వయం తదితర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు.
జలధార–జలహారతిపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో చెరువుల పునరుద్ధరణ, ఫీడర్ ఛానళ్ల శుభ్రపరిచే పనులు, వర్షపు నీటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను కలెక్టర్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న వ్యవసాయ శాఖ
రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం రైతులకు సకాలంలో చేరేలా మీడియా సహకరించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై అవగాహన
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, ఆంగ్ల మాధ్యమ బోధన, డిజిటల్ విద్య వంటి అంశాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను తల్లిదండ్రులకు తెలియజేయడంలో మీడియా పాత్ర కీలకమన్నారు.
మీడియా సమస్యలను విన్న కలెక్టర్
సమావేశంలో మీడియా ప్రతినిధులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా కొంతమంది అధికారులు మీడియా కోరిన సమాచారం సకాలంలో అందించడం లేదని, దీనివల్ల సమాచార లోపం ఏర్పడుతోందని వివరించారు.
అలాగే జిల్లా స్థాయిలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు ముందస్తు సమాచారం ఇవ్వడం, మీడియా ప్రతినిధుల రవాణా సౌకర్యాలపై దృష్టి పెట్టడం, వివిధ శాఖల నుంచి సమాచారాన్ని వేగంగా అందించే వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.
కమ్యూనికేషన్ గ్యాప్‌కు తావు ఉండకూడదు
ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ, అధికారులు మరియు మీడియా మధ్య సమాచార లోపం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని అధికారులను ఆదేశించారు.
సమాచార శాఖ మరింత చురుకుగా వ్యవహరించి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని మీడియాకు చేరవేయాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో మీడియా–పరిపాలన పరస్పర సహకారంతో పనిచేయాలని కోరారు.
అభివృద్ధి కార్యక్రమాలకు మీడియా సహకారం అవసరం
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరాలంటే మీడియా సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలోనూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ మీడియా ద్వైపాక్షిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు.
జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పరిపాలన లక్ష్యంగా పరిపాలన–మీడియా సమన్వయం మరింత బలోపేతం కావాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
