బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నిఘా

బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నిఘా

రాత్రి వేళ చెక్‌పోస్టుల ఆకస్మిక తనిఖీ

విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశం

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లావ్యాప్తంగా బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా సరిహద్దులు, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ చెక్‌పోస్టులను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ షోరాణ్ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

పండుగ నేపథ్యంలో జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన ఆదేశించారు. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

బక్రీద్ పండుగ సందర్భంగా జంతువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహన తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది మర్యాదపూర్వకంగా, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

పోలీస్ సిబ్బందితో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అలసత్వానికి తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. జిల్లాలో బక్రీద్ పండుగను మతసామరస్యంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసినా, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం. జావళి, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply