తీవ్రమైన వడగాల్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
తీవ్రమైన వడగాల్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, చలివేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు..
వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి..
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఏడు రోజుల పాటు జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు మధ్య, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఈనెల 20 నుండి 26 వరకు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశముందని తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అత్యవసర పరిస్థితులు మినహా మధ్యాహ్న వేళల్లో ప్రజలు బయటకు రావద్దని సూచించారు.ద్రవ పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
ఎండ తీవ్రత కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ తాగునీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్‌ఎస్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, తలపాగా, పలుచటి పత్తి దుస్తులు వినియోగించాలని తెలిపారు. చిన్నపిల్లలను వాహనాల్లో ఒంటరిగా వదిలివేయకూడదని హెచ్చరించారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఉపాధి హామీ పథకం, ఇతర బహిరంగ పనుల్లో పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడగాల్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్‌లు, ప్రజా ప్రకటన వ్యవస్థలను వినియోగించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ఉష్ణోగ్రత హెచ్చరికలు, జాగ్రత్తల సూచనలు ప్రదర్శించాలని తెలిపారు. బస్ స్టాండ్లు, మార్కెట్లు, కూడళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్మిక అడ్డాలు వంటి రద్దీ ప్రాంతాల్లో తగిన తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
అవసరమైన చోట చలివేంద్రాలు, తాత్కాలిక నీటి కియోస్క్‌లు, ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.మున్సిపల్ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, నిరాశ్రయులు, వీధి వ్యాపారులు, పారిశుధ్య కార్మికులు, నిర్మాణ కార్మికులు వంటి బలహీన వర్గాలను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించాలని అధికారులకు సూచించారు. వార్డు స్థాయి బృందాల ద్వారా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స సామగ్రి, తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స…
తలనొప్పి, అలసట, వాంతులు, అధిక దాహం, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు వడదెబ్బ నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని తెలిపారు.పట్టణ స్థానిక సంస్థలు పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు కాలువల శుభ్రత పనులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి సరఫరా వ్యవస్థలను తనిఖీ చేసి లీకేజీలు వెంటనే సరిచేయాలని, క్లోరినేషన్ మరియు నీటి నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. వీధి జంతువులు, పక్షుల కోసం పార్కులు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో నీటి గిన్నెలు, మట్టి కుండలు ఏర్పాటు చేసి వాటిని క్రమం తప్పకుండా నింపాలని పట్టణ స్థానిక సంస్థలకు సూచించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎండ తీవ్రత వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
