KTR Malaysia Visit | ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు.
KTR Malaysia Visit | ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు.
మలేషియాకు చేరుకున్న కేటీఆర్
జూన్ 6న కౌలాలంపూర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హాజరుకానున్న కేటీఆర్ కుటుంబ సభ్యులు
KTR Malaysia Visit | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మలేషియాలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి మలేషియాకు చేరుకున్నారు. జూన్ 6వ తేదీన కౌలాలంపూర్‌లో ఈ కార్యక్రమాన్ని మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
విమానాశ్రయంలో ఘన స్వాగతం
కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్న కేటీఆర్ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ప్రవాస తెలంగాణ ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. స్వాగతం పలికిన వారిలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్, మైటా అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతితో పాటు ఇతర ముఖ్య నేతలు, ఎన్నారైలు ఉన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని విదేశాల్లో ఘనంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర సంస్కృతి, ఉద్యమ చరిత్రను ప్రవాస తెలంగాణ ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో కేటీఆర్ ప్రసంగంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. మలేషియాలో స్థిరపడిన తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరుకానున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, అభివృద్ధి, భవిష్యత్ దిశపై ప్రత్యేక చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.

