349thRank | విద్యార్థిగా మారిన దేవ్ జీ..

349thRank | విద్యార్థిగా మారిన దేవ్ జీ..

349thRank | లా సెట్ లో 349 వ ర్యాంక్
సంకల్ప బలానికి చిత్తశుద్ధి తోడైతే
వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే

349thRank | కరీంనగర్, ఆంధ్రప్రభ : అజ్ఞాతంలోనే అత్యధిక జీవితం అంతా గడిపేసిన మావోయిస్టు మాజీ చీఫ్ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి జనజీవన స్రవంతిలో కలిసాక తుపాకీ వీడిన చేతులతో కలం పట్టారు. మావోయిస్టు నుండి విద్యార్థిగా మారిపోయారు. ఉద్యమ బాట ఎంచుకున్న సమయంలో నిలిపేసిన విద్యను తిరిగి ప్రారంభించారు. అడవి పాట ఎంచుకున్న సమయంలో మిగిలిపోయిన ఇంటర్ సబ్జెక్టు పరీక్షలు ఇటీవల తిరిగి రాశారు.

వయసు నంబర్ మాత్రమే..

వయసు నంబర్ మాత్రమే అని నిరూపించారు తిరుపతి. ఆరు పదుల వయసు దాటింది. అయినప్పటికీ ఆయనలో చదువు మీద ఉన్న ఇష్టం ఏ మాత్రం తగ్గలేదు. నాలుగున్నర దశాబ్దాల క్రితం ఇంటర్ లో చదువు వదిలేసి అడవిబాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా కూడా చదువుపై ఆకాంక్ష ఈసమంత కూడా తగ్గలేదు.
పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చాక తన ఆకాంక్షను నెరవేర్చుకునే పనిలో పడ్డారు.ఇంటర్ లో తప్పిన తెలుగు సబ్జెక్ట్ పరీక్షను ఇటీవల రాశారు.

లా సెట్ లో 349 వ ర్యాంక్..

తుపాకీ వీడిన చేతులతో కలం పట్టి పుస్తకాలు చదవడం ప్రారంభించారు. ప్రభుత్వం నిర్వహించిన లాసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ప్రతిభ నిరూపించుకున్నారు.. లాసెట్ లో 349 వ ర్యాంక్ సాధించారు.
మావోయిస్టులకు అధినేతగా ఎదిగిన నాయకుడు ఇప్పుడు విద్యార్థిగా మారిపోయి.. మూడోతరం టీనేజర్లతో కలిసి చదువుకుంటున్నారు. పరీక్షలకు హాజరవుతున్నారు.మొత్తంగా తుపాకీ పట్టిన చేతులు ఇప్పుడు కలం పట్టుకోవడం అందరినీ ఆకట్టుకునేలా చేస్తోంది.

Leave a Reply