Rs.700 crore | డీసీఎల్ ఆఫీస్ వద్ద ధర్నా

Rs.700 crore | డీసీఎల్ ఆఫీస్ వద్ద ధర్నా
Rs.700 crore | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డీసీఎల్ కార్యాలయం(DCL office) ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఏఎల్ఓ నీరజకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంఏ రెహమాన్, వెంకట్రాజ్యం మాట్లాడుతూ భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడాన్ని ఏఐటీయూసీ(AITUC) తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీలను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నేరుగా కార్మికులకు బీమా సౌకర్యాన్ని అందించాలని చెప్పారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల(private insurance companies)కు వేసిన రూ.700 కోట్ల(Rs.700 crores) వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని అన్నారు. ఆరోగ్య పరీక్షల పేరిట ప్రతి కార్మికుడి పేరుపై ప్రభుత్వం దగ్గర నుంచి రూ.3500 నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించారు.
సీఎస్సీ సంస్థను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ సంఘం జిల్లా కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ కార్మికులందరికీ హెల్త్ కార్డులు(health cards) ఇవ్వాలని, 60 ఏండ్లు దాటిన కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వడంతోపాటు పిల్లల చదువులకు ఉపకారవేతనాలు ఇవ్వాలని తెలిపారు.
లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.లక్ష్మి, నర్సింలు, బంజారా నాగులు, లక్ష్మి, కల్పన, దుర్గమ్మ, మాధవి, నీలమ్మ, యాదయ్య, రాజు, కిరణ్, కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, ఆర్కేఎస్ నాయకులు ఎల్.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
