జగిత్యాలలో వ్యక్తి …
జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల రూరల్ (Jagtial Rural) మండలం పొలాస- గుల్లపేట బైపాస్ రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని హత్య (Murder) చేసిన గుర్తు తెలియని దుండగులు మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలో పడేసి వెళ్లారు. కాగా మృతుడిని జగిత్యాల పట్టణంలోని సుతారిపేటకు చెందిన ఎండి. నయీముద్దీన్ (43)గా గుర్తించారు.
వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ కాగా ఆదివారం రాత్రి 12 గంటలకు జగిత్యాల పాత బస్టాండ్ నుంచి ఇద్దరు ప్రయాణికులను తన ఆటోలో ఎక్కించుకొని తన పాన్ షాప్ ముందు నుంచి ధర్మపురి (Dharmapuri) వైపు వెళ్లడం చూసినట్లు మృతుడి సోదరుడు ఇసాక్ తెలిపాడు. ఇదిలా ఉండగా స్థానికుల ద్వారా అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు (police) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
