కొండగట్టు దర్శనం అనంతరం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

కొండగట్టు దర్శనం అనంతరం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ఎదురెదురుగా ఢీకొన్న కారు–లారీ.. బాలుడికి తీవ్ర గాయాలు

మేడ్చల్, ఆంధ్రప్రభ : కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న ఓ కుటుంబాన్ని ఘోర రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. కరీంనగర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరిపల్లి గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన కారు–లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. జనగాం రాజశేఖర్ ఫిర్యాదు మేరకు, గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన రెండు కుటుంబాలు మార్గమధ్యంలో కొండగట్టు దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కొనసాగించాయి. ఈ క్రమంలో చంద్రశేఖర్ నడుపుతున్న మారుతి బ్రెజ్జా కారు (TS08JL8300) రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనం కంటే సుమారు రెండు కిలోమీటర్ల ముందుగా వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

గురువారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో మురహరిపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ (TG05T9635)ను బ్రెజ్జా కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నడుపుతున్న చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య రేఖ, కుమారులు లోహిత్, నిహాల్ తీవ్రంగా గాయపడ్డారు. వెనుక వస్తున్న రాజశేఖర్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేఖ, చిన్న కుమారుడు నిహాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో కుమారుడు లోహిత్ తొడ ఎముక విరిగి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేపట్టారు.