ప్రతి ఇంటా యోగా..

ప్రతి ఇంటా యోగా..

సంపూర్ణ ఆరోగ్యానికి ఇదే మార్గం!

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: యోగాను నిత్యజీవితంలో అలవర్చుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ, ఇండస్ట్రీస్ జీఎం శ్రీధర్ సంయుక్తంగా పిలుపునిచ్చారు.

గురువారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ పార్కులో ఆయుష్ శాఖ సమన్వయంతో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి ఇంటా యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు, ఉద్యోగుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని యోగా దూరం చేస్తుందని తెలిపారు.

అనుభవజ్ఞులైన యోగాచార్యుల పర్యవేక్షణలో ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానంపై ఉచితంగా శిక్షణ పొందడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ మాట్లాడుతూ, యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాలను యోగా ద్వారా మరింత మెరుగుపర్చుకోవచ్చని తెలిపారు.

జిల్లా ఆయుష్ అధికారి ఉత్తమ్ రాజ్ రాణా మాట్లాడుతూ, ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు అద్భుతమైన వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని చెప్పారు. యోగా శరీరం, మనస్సు, ఆత్మను అనుసంధానించే సమగ్ర జీవన విధానమని వివరించారు.

ఈ కార్యక్రమంలో యోగా గురువులు పాండ్రంకి మురళీకృష్ణ, కొంక్యాన మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పరిశ్రమల శాఖ, ఆయుష్ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.