కేటీఆర్ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి
కేటీఆర్ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి
జిల్లా అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు : కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగరాజు
ఖమ్మం, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు హితవు పలికారు. ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన పార్టీ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయిందని, ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నదని నాగరాజు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మంత్రులు ప్రజల మధ్య నుంచి ఎదిగిన నాయకులని, కేటీఆర్ మాత్రం తన తండ్రి పేరు ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తుంటే, వాటిని చూసి ఓర్వలేకే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని నాగరాజు ఆరోపించారు. జిల్లాలో బీఆర్ఎస్కు భవిష్యత్తులో ఒక్క సీటు కూడా రాదనే భయంతోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ అహంకారానికి తగిన గుణపాఠం చెప్పారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ పూర్తిగా ప్రజా మద్దతు కోల్పోతుందని వ్యాఖ్యానించారు.
