కేజీబీవీ విద్యార్థి ఆత్మహత్య..

వసతిగృహంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థిని మృతి


కొత్తూరు, జులై 31(ఆంధ్రప్రభ ) : శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న కేజీబీవీ టైప్-4 వసతి గృహంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న సవర పూజా అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం అర్ధరాత్రి స్థానిక వసతి గృహంపై అంతస్తులో ఉన్న ఒక గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని పూజా ఉన్నట్లు వసతిగృహం సిబ్బంది శుక్రవారం ఉదయం చూశారు.

ఈసంఘటన పై కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎ.గోవిందరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సవర పూజా, ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం స్థానిక కళాశాలలోనే చదువుతుందన్నారు. పూజాను ఇక్కడ చేర్చకముందు రాజాం కళాశాలలో జాయిన్ అయ్యిందని, ఐతే అక్కడ నుండి పూజా తల్లిదండ్రులు కొత్తూరులో చేర్పించగా, గత 20 రోజుల క్రితం స్థానిక కేజీబీవీలో చేరిందన్నారు. ఈమె స్వగ్రామం, సీతంపేట మండలం దేవానపురం పంచాయితీ, లక్కాయ్ గూడ. సంఘటన స్థలాన్ని కొత్తూరు పోలీసులు చేరుకుని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.