Sensex | సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ప్రారంభం..

బజాజ్ ఫైనాన్స్ జోరు.. ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్న నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సానుకూల ధోరణిలో ట్రేడింగ్‌ను ప్రారంభించగా, నిన్నటి లాభాలను కొనసాగించే ప్రయత్నం చేశాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 77,928.15 పాయింట్లతో పోలిస్తే 77,998.66 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభంలో 52.35 పాయింట్లు (0.07 శాతం) లాభపడి 77,980.50 వద్ద కొనసాగింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24,361.45 వద్ద ప్రారంభమై, ప్రారంభ ట్రేడింగ్‌లోనే 24,380 మార్కును దాటింది. నేటి ట్రేడింగ్‌లో బజాజ్ ఫైనాన్స్ షేర్లు దాదాపు 6 శాతం ఎగబాకి మార్కెట్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్, ఎటర్నల్ షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.

అయితే ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ ఐటీ సూచీ ప్రారంభంలోనే 3 శాతానికి పైగా క్షీణించింది. ఇన్ఫోసిస్ షేరు 4 శాతం వరకు పడిపోగా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. అనంతరం కొంత మేర కోలుకునే ప్రయత్నం చేశాయి. మార్కెట్ బ్రెడ్త్ కూడా సానుకూలంగా కనిపించింది. ఉదయం ట్రేడింగ్‌లో సుమారు 1,780 షేర్లు లాభాల్లో, 973 షేర్లు నష్టాల్లో ఉండగా, 142 షేర్లు మార్పులేకుండా కొనసాగాయి.