ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయాను: కేసీఆర్

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్, ఆంధ్రప్రభ బ్యూరో: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో తనతో కలిసి నడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయనను కాపాడేందుకు పార్టీ చేసిన విశ్వప్రయత్నాలు, వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం తీవ్ర మనోవేదన కలిగించిందన్నారు.

తెలంగాణనే శ్వాసగా భావిస్తూ నీతి, నిజాయితీతో ప్రజాజీవనం సాగించిన పెద్ది రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని కొనియాడారు. పోరాటాల ఖిల్లాగా పేరొందిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని ప్రశంసించారు. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు పార్టీ జెండా నీడలోనే పనిచేస్తూ, ఉద్యమంలోనూ, నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడని కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలు కూడా ఆయనను వెనక్కి తగ్గించలేకపోయాయని గుర్తుచేసిన కేసీఆర్, పెద్ది ఉద్యమ పటిమ, ధైర్యసాహసాలు, ప్రజల కోసం చేసిన సేవలు కార్యకర్తలు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోయి శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.