సింగరేణిని దోచుకున్న వారే ఇప్పుడు నీతులు చెబుతున్నారు

సింగరేణిని దోచుకున్న వారే ఇప్పుడు నీతులు చెబుతున్నారు

  • నిజాన్ని అబద్ధం… అబద్ధాన్ని నిజం చేయడం కేసీఆర్ కుటుంబానికే సాధ్యం
  • భూపాలపల్లికి రావాల్సిన 800 మెగావాట్ల ప్లాంటును యాదాద్రికి తరలించారు
  • డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను ఇతర జిల్లాలకు మళ్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ధ్వజం

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : సింగరేణిని సర్వనాశనం చేసిన వారే ఇప్పుడు దాని పరిరక్షకులుగా మాట్లాడటం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మార్చే సంస్కృతి ఈ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబానికే అలవాటైందని ఘాటుగా విమర్శించారు.

భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల ఆర్సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని ఆదాయ వనరుగా కాకుండా దోపిడీ కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. అందినకాడికి దోచుకుని, ఇప్పుడు సింగరేణి కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు మాట్లాడటం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనన్నారు.

భూపాలపల్లిపై వివక్ష.. యాదాద్రికి వరాలు
భూపాలపల్లికి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును రాజకీయ ప్రయోజనాల కోసం యాదాద్రికి తరలించారని గండ్ర ఆరోపించారు. ప్రాజెక్టు వ్యయాలను అమాంతం పెంచి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. నాసిరకం సామగ్రి, అవినీతి నిర్మాణాలతో ప్లాంటును పనికిరాని స్థితికి చేర్చారని అన్నారు.

సింగరేణి నిధుల మళ్లింపు ఎవరి హయాంలో జరిగింది?
సింగరేణి పరిధిలోని ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను సిద్ధిపేట, హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాలకు తరలించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదా అని ప్రశ్నించారు. గనుల వల్ల ఇబ్బందులు పడుతున్న భూపాలపల్లి ప్రజలకు న్యాయం చేయకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం నిధులను మళ్లించారని ఆరోపించారు.

హరీష్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదం
మాజీ మంత్రి హరీష్ రావు భూపాలపల్లి పర్యటనలో సింగరేణిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని గండ్ర ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అన్న చందంగా సింగరేణిని బలహీనపరిచిన వారే ఇప్పుడు దాని గురించి నీతులు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

ప్రజల తీర్పును ఇంకా అర్థం చేసుకోని బీఆర్ఎస్
పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్రాన్ని నష్టపరిచిన బీఆర్ఎస్‌కు ప్రజలు ఇప్పటికే గుణపాఠం చెప్పారని గండ్ర అన్నారు. అయినప్పటికీ తమ తప్పులను అంగీకరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు దేవన్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *