డీఎస్సీపై తప్పుడు ప్రచారం మానుకోండి..
డీఎస్సీపై తప్పుడు ప్రచారం మానుకోండి..
లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు: ఎమ్మెల్సీ శ్రీకాంత్
తిరుపతి సిటీ, ఆంధ్రప్రభ : డీఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలు కొనసాగిస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హెచ్చరించారు.
శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, నాయకులు చేస్తున్న ఆరోపణలపై తాము ఆధారాలతో చర్చకు సిద్ధమని పలుమార్లు ప్రకటించామని తెలిపారు. వారి వద్ద ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని, ప్రతి అంశానికీ సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.
అయితే, చర్చకు రావాలని సవాల్ విసిరినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, నాయకులు ఎవరూ ముందుకు రాలేదని విమర్శించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై అధికారులు కూడా స్పష్టమైన వివరాలు, ఆధారాలతో వివరణ ఇచ్చారని పేర్కొన్నారు.
తాము చెప్పిన విషయాలు తప్పని ఆధారాలతో నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఇప్పటికే ప్రకటించామని శ్రీకాంత్ గుర్తుచేశారు. అయినప్పటికీ అవాస్తవ ప్రచారం కొనసాగించడం నిరుద్యోగుల్లో ఆందోళనకు దారితీస్తోందని అన్నారు.
అనంతరం శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, నిరుద్యోగులను తప్పుదోవ పట్టించకుండా ఆధారాలతో చర్చకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరామని తెలిపారు. అయితే, ఆహ్వానించినప్పటికీ ఎవరూ చర్చలకు హాజరు కాలేదని విమర్శించారు.
డీఎస్సీ నియామకాల విషయంలో కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా అవాస్తవ ప్రచారాన్ని నిలిపివేసి నిరుద్యోగులను గందరగోళానికి గురిచేయవద్దని సూచించారు.
ఈ సమావేశంలో గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు రాయల్, నాయకులు వివేక్, ఆనంద్ గౌడ్, మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
