జాతీయ ఓబీసీ మహాసభకు హరిప్రసాద్‌కు ఆహ్వానం

బీసీల హక్కుల సాధనే మహాసభ ప్రధాన లక్ష్యమని నిర్వాహకుల వెల్లడి

మునుగోడు, ఆంధ్రప్రభ: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మార్గదర్శకత్వంలో ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు బి.కె. హరిప్రసాద్‌కు బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్ గౌడ్, బీసీ ప్రతినిధులతో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా విజయ్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహణ, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఓబీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల సాధనే ఈ మహాసభ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ఉద్యమానికి బి.కె. హరిప్రసాద్ మద్దతు బీసీ సమాజానికి మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన హరిప్రసాద్ మహాసభకు హాజరవుతానని హామీ ఇచ్చినట్లు విజయ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ ప్రతినిధులు భవన్ రామ్ తైవడే, సచిన్ రాజోర్‌కార్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యామ్ కురుమ, రావుల కోల్ నరేష్ ప్రజాపతి, లక్ష్మణ్ జిత్ తదితరులు పాల్గొన్నారు.