ఒలింపిక్ రన్ విజయవంతం చేయండి
జూన్ 29న నిజామాబాద్‌లో నిర్వహణ
ఒలింపిక్ సంఘం జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి
నిజామాబాద్ స్పోర్ట్స్, (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ ప్రజల్లో ఫిట్‌నెస్, ఐక్యత, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో ఒలింపిక్ విలువలను చాటిచెప్పే లక్ష్యంతో నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన ప్రతిష్టాత్మకమైన “ఒలింపిక్ రన్” (Olympic Run) నిర్వహించనున్నట్లు జిల్లా ఒలింపిక్ సంఘం ఇంచార్జ్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి కార్యదర్శి బొబ్బిలి నరసయ్య తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పోలీసు శాఖ అధికారులు, క్రీడా ప్రముఖులు తదితరులు పాల్గొననున్నారని అన్నారు.
జిల్లాలోని 28 పాఠశాలల విద్యార్థులు ఈ రన్‌లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమం జూన్ 29న ఉదయం 10 గంటలకు స్థానిక రాజరాజేంద్ర చౌరస్తా వద్ద ప్రారంభమై, డీఎస్ఏ గ్రౌండ్‌లో ముగుస్తుందనీ పేర్కొన్నారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు విద్యార్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం https://run.psports.cloud వెబ్‌సైట్‌లో పేరు, విద్యాసంస్థ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నమోదు అనంతరం అందించే 6 అంకెల ప్రత్యేక రిఫరెన్స్ నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని, కార్యక్రమం పూర్తయిన అనంతరం అధికారిక ఈ-పార్టిసిపేషన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ నంబర్ అవసరమని తెలిపారు.
జిల్లా క్రీడా అభివృద్ధికి ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనున్నందున అన్ని విద్యాసంస్థలు తమ విద్యార్థులను అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం కోశాధికారి భూమిరెడ్డి, ఉపాధ్యక్షులు భక్తవత్సలం, సంయుక్త కార్యదర్శులు వెంకటేష్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇంచార్జ్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, బొబ్బిలి నర్సయ్య, జనరల్ సెక్రటరీలు విజ్ఞప్తి చేశారు
