శివాలయం లౌడ్‌స్పీకర్ల తొలగింపుకు యత్నిస్తే ఆందోళనలు
గుజ్జుల రామకృష్ణారెడ్డి
ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించే చర్యలు సహించబోమని హెచ్చరిక
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి పట్టణంలోని పురాతన శివాలయంలో లౌడ్‌స్పీకర్ల తొలగింపునకు సంబంధించి స్థానిక కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వస్తున్న సమాచారం నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బుధవారం స్పందించారు.
పెద్దపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆలయంలోని లౌడ్‌స్పీకర్ల తొలగింపునకు అధికారులు ప్రయత్నిస్తే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
శివాలయంలో సుప్రభాతం, భక్తి గీతాలు, శివనామస్మరణ వంటి కార్యక్రమాలు తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఫిర్యాదు చేసినట్లు పేర్కొంటున్న కౌన్సిలర్ వెంటనే తన ఫిర్యాదును ఉపసంహరించుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని, ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించే చర్యలను బీజేపీ సహించదని స్పష్టం చేశారు.
ఇతర మత ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా శివాలయంలో మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పల్లె సదానందం, శిలివేరు ఓదెలు, భూషణవేణి శ్రీనివాస్ గౌడ్, జంగా చక్రధర్ రెడ్డి, పర్శ సమ్మయ్య, మీస అర్జున్‌రావు, రాంసింగ్, శిలారపు పర్వతాలు, శనిగరపు రమేష్, గర్రెపల్లి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
