ఎస్. జానకి మృతి సినీ సంగీతానికి తీరని లోటు: తొర్రూరు గాయకులు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ప్రముఖ బహుభాషా నేపథ్య గాయని, లెజెండరీ సింగర్ ఎస్. జానకి మృతి సినీ సంగీత ప్రేమికులను తీవ్ర విషాదంలో ముంచిందని తొర్రూరు ప్రాంతానికి చెందిన పలువురు గాయకులు, కళాకారులు పేర్కొన్నారు. ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తూ సంతాపం తెలిపారు.

తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు, చైతన్య కళా సమాఖ్య అధ్యక్షుడు మన్నూరి ఉమా, ప్రధాన కార్యదర్శి, గాయకుడు సుంకరనేని పినాకపాణి మాట్లాడుతూ, ఎస్. జానకి నింగికెగసిన గానగంధర్వుడు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పక్కన మరో లెజెండరీ స్వరతారగా చేరారని అన్నారు. తెలుగు సహా పలు భాషల పాటల అభిమానులకు, సంగీత ప్రపంచానికి ఆమె మృతి తీరని లోటని పేర్కొన్నారు.

జానకి ఈ లోకంలో భౌతికంగా లేకపోయినా, ఆమె ఆలపించిన ప్రతి పాటలో, చిన్నారుల కేరింతల్లో ఆమె స్వరం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, దైవం ఆమెకు సద్గతి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు.

ఎస్. జానకి మైసూరులోని అపోలో ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారని గుర్తు చేశారు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఆమె ఆరు దశాబ్దాలకు పైగా సినీ గాన సేవ చేసి, 17 భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించారని తెలిపారు. “దక్షిణ భారత కోకిల”గా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె పద్మభూషణ్‌తో పాటు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారని పేర్కొన్నారు.

మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న ఎస్. జానకి, గ్రామీణ జానపదం నుంచి శాస్త్రీయ సంగీతం, మెలోడీ, భక్తి గీతాల వరకు తన ప్రతిభను చాటారని కొనియాడారు. భారతీయ సినీ సంగీత రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆమె మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొందని తెలిపారు.

ఈ సందర్భంగా తొర్రూరు ప్రాంతానికి చెందిన గాయకులు తమ్మెర వెంకట్, ఠంయ్యాల శ్రీధరాచార్యులు, రామేశ్వర చారి, పోతుల వెంకటేశ్వర్ రెడ్డి, కొత్తపెళ్లి మధు, లావణ్యతో పాటు పలువురు కళాకారులు ఒక ప్రకటనలో ఎస్. జానకికి ఘన నివాళులు అర్పించారు.