మానవ సంబంధాలకు సాంకేతికతను జోడించకండి!
మానవ సంబంధాలకు సాంకేతికతను జోడించకండి!
- టెక్నాలజీతో పెరుగుతున్న దూరాలు.. తగ్గుతున్న బంధాలు
- ఆన్‌లైన్ సౌకర్యాల కంటే మానవ అనుబంధాలే గొప్పవి
- డిజిటల్ ప్రపంచంలో కనుమరుగవుతున్న ఆత్మీయత
- పరికరాలను వాడండి.. మనుషులను ప్రేమించండి
ఇటీవల రిటైరైనా కొందరి చిరుద్యోగుల కథలు వ్యధలుగా మారుతున్నాయి. ఒకరోజు తండ్రితో బ్యాంకులో క్యూలో నిల్చోవడానికి కోపంతో, విసుక్కున్న కొడుకుతో… ఆ తండ్రి ఇచ్చిన ఆన్సర్స్, తిరుగు క్వశ్చన్స్ ఏమిటో.. ఉదాహరణగా చూద్దాం! సిటీలో చదువుతున్న ఆ కొడుకు ప్రశ్నలకు తండ్రి స్పందన కూడా ఆలోచింపదగినది.
కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ల నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి నామోషీగా.. తన తండ్రిని ఇలా అడిగాడు.
“నాన్నగారూ, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్, గూగుల్ పే.. లాంటివి ఎందుకని ఆక్టివేట్ చేసుకోరు?”
“ఎందుకు చేయించుకోవాలి రా?” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు.
“ఇలా ఇక్కడ గంట సేపు మనీ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూడనక్కర్లేదు నాన్నా. ఇంకా సామాన్లు వగైరాలు కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టి గంటలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు.”
వేగవంతమైన నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కోసం ఆన్‌లైన్ ప్రపంచంలోకి, నెట్టింట్లోకి తండ్రిని లాగడానికి కొడుకు తెగ ఆరాటపడుతున్నాడు.
తండ్రి : “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరమే ఉండదు కదరా?”
“అవునవును” అని కొడుకు జవాబిస్తూనే… “కానీ… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు ఇలాంటివెన్నో అలవోకగా తెప్పించుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా, భద్రంగా సామాన్లు ఇంటికి గంటలోపే చేరవేస్తున్నాయి”… అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు.
అంతా విన్న సగటు తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కి ఇంక మాటలే రావట్లేదు!
“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులను నలుగురిని కలిసాను. ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్లతోనూ హ్యాపీగా ముచ్చటించాను. నీకు తెలుసు నేను ఒంటరివాడినని. నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే కదరా. నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా రెడీ అయ్యి ఇలాంటి పరిచయాలెన్నో పంచుకోగలను.
రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎల్లప్పుడూ పండ్లు కొనే కొట్టువాడు నన్ను చూడటానికి వచ్చి పలకరించాడు. నాకోసం బాధపడ్డాడు. కన్నీళ్లు కార్చాడు. నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు.
కొన్ని రోజుల క్రితం… అమ్మ మార్నింగ్ వాక్ కోసం వెళ్లినప్పుడు కళ్లుతిరిగి పడిపోయింది. మనం ఎల్లప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు తన బండిని తీసుకుని అమ్మను ఇంటికి చేర్చాడు.
నువ్వన్నట్టు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే.. ఈరోజు నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా? పండ్ల కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా? కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా? ఇంటి చుట్టూరా ఉండే వాళ్లతో పలకరింపులు, బంధువుల రాకపోకలు, పాత-కొత్త స్నేహాలు, పరస్పర సేవాభావం ఉండేవా? ముఖ పరిచయం లేని ఆన్‌లైన్ సేవలు దగ్గరగా వచ్చి పలకరిస్తాయా?
ఒక కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్‌తో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే… నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక ఎలక్ట్రానిక్ పరికరమా? పనీ పాటా లేని వారిలా మరమనుషులతో నా మలి జీవితం..!
నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్లను చూస్తూ.. వాళ్లతో మాట్లాడటం నాకిష్టం. ఆన్‌లైన్ ప్రపంచంలో ముక్కు మొహం తెలియని స్నేహాలెందుకు? కొన్ని విదేశాల్లో జరిగే ఆన్‌లైన్ పెళ్లిళ్లు ఎందుకు? చుట్టరికాల్లేని బంధుత్వాలు, సైబర్ క్రైమ్, పబ్జీ వంటి ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్, ఆన్‌లైన్ మోసాలు… మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. భౌతిక ప్రపంచానికి దూరం చేస్తాయి.
నువ్వనే ఆ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నాకు కావలసినవన్నీ దొరుకుతాయా? కేవలం నీకు సామాను పంపే డెలివరీ బాయ్ పేరు తప్ప, ఏమి తెలుస్తుంది?
మనిషి మనిషి కలుసుకున్న నాడే సత్సంబంధాలు నెలకొంటాయి. బంధాలు బలపడతాయి. నిలబడతాయి.
టెక్నాలజీ ఉండాలి కానీ… అదే జీవితం కాకూడదు! దానికెప్పుడూ మనం బానిసలుగా, బంధీలుగా మారకూడదు!
మనుషులతో జీవించండి. మంచి మనసుతో ప్రేమించండి. పరికరాలను వాడుకోండి… కానీ మరమనుషులను ఆహ్వానించేలా ఆలోచించకండి. శరీర కదలికలేని అనారోగ్యం కొని తెచ్చుకోకండి.
“ప్రేమించవలసిన మనుషులను వదులుకొని, వాడుకోవాల్సిన నిర్జీవ పరికరాలతో జీవించకండి.” తెగిపోతున్న నేటి మానవ సంబంధాలకు కొంత టెక్నాలజీ ముడి విప్పండి.
