కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

  • పూర్తయిన రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ
  • మే 10న ప్రారంభించనున్న ప్రధాని మోడీ
  • ప్రత్యక్షంగా మూడు వేల మందికి, పరోక్షంగా మరో ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో: దశాబ్దాల పోరాట ఫలితం.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మూడు ప్రధాన హామీలలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి వరంగల్ వేదికగా కాజీపేటలో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు 2023 జూలై 8న శంకుస్థాపన చేశారు.

ఆనాడు రూ. 521 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఫ్యాక్టరీ నిర్మాణం ప్రస్తుతం రూ. 10 కోట్లు అదనంగా పెరిగింది. మొదట కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఓవర్‌హాలింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే కాజీపేట ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిపే ప్రధాన జంక్షన్ కావడంతో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్‌తో పాటు ఆధునిక సాంకేతికతతో వందే భారత్ రైలు కోచ్‌లను కూడా తయారు చేసే విధంగా అభివృద్ధి చేశారు.

మూడేళ్లలోపే నిర్మాణం పూర్తి
2014లో పార్లమెంట్‌లో హామీ ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ 2023లో రూపుదిద్దుకుంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీలు జూలై 8న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో వర్చువల్‌గా ప్రారంభించారు. హనుమకొండ జిల్లా అయోధ్యపురం వద్ద 160 ఎకరాల్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. శంకుస్థాపన రోజునే రూ. 521 కోట్లతో పనులను వేగంగా పూర్తి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2025 జూలై 19న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కూడా పనుల పురోగతిపై దృష్టి సారించారు. 2025 డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా, 2026 ఫిబ్రవరిలో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైంది. మూడు సంవత్సరాల వ్యవధిలోనే ప్రాజెక్ట్ పూర్తి కావడం విశేషం. ఈ ఫ్యాక్టరీ ద్వారా సంవత్సరానికి 2,400 కోచ్‌లను తయారు చేసే లక్ష్యంతో సన్నాహాలు చేస్తున్నారు. వ్యాగన్ ఓవర్‌హాలింగ్‌తో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోచ్‌ల తయారీ కూడా జరుగుతుంది.

వేలాది మందికి ఉపాధి అవకాశాలు
కాజీపేటలో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తికావడంతో మూడు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అదనంగా పరోక్షంగా మరో ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రస్తుతం డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాజీపేట ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.

మే 10న ప్రారంభం
కాజీపేటలో నిర్మాణం పూర్తయిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మే 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం జరగనుంది. ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ కొనసాగుతోంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.