ఉత్కంఠగా జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు

ఎన్టీఆర్ స్టేడియంలో జోరుగా పోటీలు.. రాష్ట్ర స్థాయికి విజేతల ఎంపిక

గుంటూరు స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారు.

అండర్-11, అండర్-13, అండర్-15 విభాగాల్లో స్థానిక వేణు బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు రాణించి పతకాలు కైవసం చేసుకున్నారు. అలాగే నరసరావుపేటకు చెందిన కోచ్‌లు చందు, సైదావలి వద్ద శిక్షణ పొందుతున్న క్రీడాకారులు కూడా అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధించారు. విజేతలకు జిల్లా బ్యాడ్మింటన్ కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు.

అండర్-16, అండర్-19, పురుషుల, మాస్టర్స్ విభాగాల పోటీలు కూడా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పోటీలు నేటి అర్ధరాత్రి వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి సంపత్‌కుమార్ తెలిపారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు. పోటీలను జిల్లా కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.