Film Nagar Accident | ఫిలింనగర్‌లో ఫెరారీ బీభత్సం..

అపార్ట్‌మెంట్ గేటును ఢీకొట్టిన స్పోర్ట్స్ కారు
వేకువజామున అదుపుతప్పిన ఫెరారీ..
ప్రమాదం తర్వాత యువకులు పరార్..
మద్యం మత్తు లేదా నిర్లక్ష్యపు డ్రైవింగా? పోలీసుల దర్యాప్తు

Film Nagar Accident | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్‌లో ఆదివారం వేకువజామున ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. ఫిలింనగర్ సైట్–2, రోడ్ నంబర్–5లో ఉదయం సుమారు 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న హిల్ వ్యూ అపార్ట్‌మెంట్ ప్రధాన గేటును బలంగా ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది.

ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న యువకులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం క్రేన్ సహాయంతో దెబ్బతిన్న ఫెరారీ కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ప్రాథమిక విచారణలో అతివేగం కారణంగానే కారు అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా, లేక నిర్లక్ష్యంగా వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కారును నడిపిన వ్యక్తి వివరాలు, ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.