july12th Tirumala | ఏ రోజు ఏ కోటా అంటే?

తిరుమల అక్టోబర్ దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల
జూలై 18 నుంచి దశలవారీగా బుకింగ్‌లు..
రూ.300 ప్రత్యేక దర్శనం, సేవలు, గదుల కోటా సహా పూర్తి షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ

july12th Tirumala |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల దర్శనాలు, సేవల కోసం టికెట్ల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. జూలై 18 నుంచి 24 వరకు వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక కోటాలను దశలవారీగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. టీటీడీ ప్రకారం.. జూలై 18 ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రారంభమై జూలై 20 వరకు కొనసాగుతుంది. ఎంపికైన భక్తులు జూలై 20 నుంచి 22 వరకు టికెట్లకు చెల్లింపులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

జూలై 21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను విడుదల చేస్తారు. జూలై 23న అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన కోటా, వృద్ధులు మరియు దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్ల బుకింగ్ ప్రారంభమవుతుంది. అనంతరం జూలై 24 ఉదయం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, అదే రోజు తిరుమల వసతి గదుల కోటాను కూడా విడుదల చేయనున్నారు.

అన్ని బుకింగ్‌లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే చేసుకోవాలని, ఇతర వెబ్‌సైట్లు లేదా మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని టీటీడీ భక్తులకు సూచించింది.