రైతు డిస్కంకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్.. నాలుగు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం

రైతు డిస్కంకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్.. నాలుగు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం

  • టీజీ ఆర్పీడీసీఎల్‌కు లైసెన్స్ మంజూరు చేసిన ఈఆర్సీ
  • రైతులకు ఉచిత విద్యుత్ యథాతథం.. పంపుసెట్లకు మీటర్లు లేవు
  • ఉద్యోగుల హక్కులకు పూర్తి రక్షణ
  • నాలుగు నెలల్లో కొత్త డిస్కం సేవలు ప్రారంభం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఆర్పీడీసీఎల్)కు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎట్టకేలకు లైసెన్స్ మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

రైతులకు ఉచిత విద్యుత్, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన విద్యుత్ కనెక్షన్లకు ప్రభుత్వం ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేసింది. కొత్తగా లైసెన్స్ పొందిన రైతు డిస్కం ద్వారా రైతులకు ఉచిత విద్యుత్, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు, ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లతో ఉన్న మున్సిపల్ తాగునీటి కనెక్షన్లకు ప్రత్యేకంగా సేవలు అందించనుంది.

ఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆర్పీడీసీఎల్ నాలుగు నెలల తర్వాత వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనుంది. రైతు డిస్కం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లు యథావిధిగా సేవలు కొనసాగిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 14, 131 ప్రకారం లైసెన్స్ మంజూరు చేసినట్టు ఈఆర్సీ స్పష్టం చేసింది.

పంపుసెట్లకు మీటర్లు ఉండవు…

రైతు డిస్కంతో ప్రైవేటీకరణకు బాటలు వేస్తోందంటూ, రైతులకు వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్‌ను ఎత్తివేస్తారని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తారనే అపోహలు అత్యధికంగా ఈఆర్సీలో వ్యక్తమయ్యాయి.

అపోహాలన్నింటికీ చెక్ పడేలా రైతులకు ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుందని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈఆర్సీ లైసెన్స్‌లో స్పష్టం చేసింది.

రైతు డిస్కం కేవలం పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ మాత్రమేనని పేర్కొంది. ఆస్తుల నిర్వహణ, ఇంధన లెక్కలు, వినియోగదారుల డేటా బదిలీ, తాత్కాలిక విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుని కమిషన్ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది.

2026-27 ఆర్థిక సంవత్సర మిగిలిన కాలానికి టారిఫ్, సబ్సిడీ అంశాలపై కమిషన్ మార్గదర్శకాలు కోరాలని పేర్కొంది. నవంబర్ 30లోగా 2027-28 టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాలని ఈఆర్సీ పేర్కొంది.

వ్యవసాయంతో పాటు బదిలీ అయ్యే అన్ని వర్గాలకు కొత్త విద్యుత్ కనెక్షన్లు నిలిపివేయడం, ఆలస్యం చేయడం వంటి చర్యలు చేపట్టకుండా ఆర్పీడీసీఎల్ ప్రారంభమయ్యే దాకా ప్రస్తుత విధానమే కొనసాగుతుందని ఈఆర్సీ తెలిపింది. కొత్త డిస్కం ప్రారంభమయ్యే వరకు కొత్త కనెక్షన్లను యథావిధిగా దరఖాస్తులు స్వీకరించి మంజూరు చేయాల్సి ఉంది.

ఉద్యోగులకు రక్షణ…

రైతు డిస్కంలో ఉద్యోగుల ప్రయోజనాలు రక్షించబడేలా, ఉద్యోగుల సేవా నిబంధనలు, సీనియారిటీ, పెన్షన్, రిజర్వేషన్ రోస్టర్, పదోన్నతులు ప్రస్తుత నిబంధనలు, న్యాయస్థాన ఉత్తర్వుల ప్రకారమే అమలు కానున్నాయి.

ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ భౌగోళిక పరిధిలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది.

ఆర్పీడీసీఎల్ కార్యకలాపాలు ప్రారంభమైన తేదీ నుంచి బదిలీ అయ్యే వినియోగదారులను తొలగించేందుకు రైతు డిస్కం దాఖలు చేసిన దరఖాస్తులను ఈఆర్సీ ఆమోదించింది.

ఈ మేరకు వినియోగదారులతో పాటు ప్రభుత్వం గుర్తించిన ఆస్తులు, అప్పులు ఆర్పీడీసీఎల్‌కు బదిలీ కానున్నాయి. ఇతర డిస్కంల మాదిరిగానే టీజీఆర్‌పీడీసీఎల్ కూడా ఈఆర్సీ నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేయనుంది.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే మరిన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. ఆర్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ మధ్య ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, వినియోగదారుల డేటా బదిలీ, విద్యుత్ సరఫరా, ఎనర్జీ అకౌంటింగ్ తదితర అంశాలపై అవగాహన ఒప్పందాలు, సేవా ఒప్పందాలు, బల్క్ సప్లై ఒప్పందాలు కుదుర్చుకుని కమిషన్ ఆమోదానికి సమర్పించాలని పేర్కొంది.

నాలుగు నెలల్లో ప్రారంభం…

కొత్త డిస్కం ప్రకటించగానే ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీని ప్రభుత్వం సీఎండీగా నియమించింది. దీంతో రైతు డిస్కం కార్యకలాపాలకు లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ మార్చి 19న విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సీఎండీ దరఖాస్తు చేశారు.

ఈ మేరకు ఈఆర్సీ మే 18 వరకు అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసి మే 29న బహిరంగ విచారణ నిర్వహించింది. విచారణలో రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వినియోగదారుల సంస్థలు, విద్యుత్ రంగ నిపుణులు తమ అభ్యంతరాలు, సూచనలు ఈఆర్సీకి సమర్పించారు.

విచారణలో వ్యక్తమైన అన్ని రకాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని లైసెన్స్ మంజూరు చేసినట్టు ఈఆర్సీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రైతు డిస్కం ద్వారా దాదాపు 30 లక్షల విద్యుత్ కనెక్షన్లు పర్యవేక్షించాల్సి ఉండగా, పరిపాలనా పరమైన అంశాలను సర్దుబాటు చేసుకునేలా నాలుగు నెలల తర్వాత కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించింది.

మూడు నెలల్లో విద్యుత్ లోడ్ అంచనాలు, నష్టాల తగ్గింపు, మీటరింగ్, సిబ్బంది, ఆర్థిక అంశాలతో కూడిన సమగ్ర ప్రణాళిక సమర్పించాలని ఆర్పీడీసీఎల్‌కు ఈఆర్సీ ఆదేశించింది.

ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆర్పీడీసీఎల్ రెండు వేదికలను ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సేవలు కొనసాగాలని ఆదేశించింది. ఉద్యోగులను బదిలీ చేసేందుకు చట్టబద్ధ బదిలీ పథకం జారీ చేసిన తర్వాతనే లైసెన్స్ అమల్లోకి రానుంది.