ఉద్యమకారులకు అండగా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి

ఉద్యమకారులకు అండగా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి

  • జేఏసీ నాయకులు

భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడి పనిచేసిన ఉద్యమకారుల కోసం ప్రత్యేక ఉద్యమ బోర్డును ఏర్పాటు చేసి, వారికి అండగా నిలవాలని తెలంగాణ జేఏసీ నాయకులు కోరారు.

ఆదివారం ముల్కనూర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 2న హుస్నాబాద్‌లో మహా ర్యాలీ నిర్వహించి, మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీని ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని నాయకులు ఆరోపించారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.

రిటైర్డ్ జడ్జి, ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జూన్ 2న హుస్నాబాద్‌లో జరిగే మహా ర్యాలీని విజయవంతం చేయడానికి ఉద్యమకారులందరూ తరలిరావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ద్యాగల సారయ్య, ఆదరి శ్రీనివాస్, చెప్పాల ప్రకాష్, బొల్లంపల్లి రమేష్, రాగం రమేష్, ఎదులాపురం తిరుపతి, మాడుగుల అశోక్, రేణిగుంట్ల బిక్షపతి, చిదురాల లింగమూర్తి, పార్నందుల జయంత్ తదితరులు పాల్గొన్నారు.