సమర్థవంతంగా జనగణన నిర్వహించాలి

సమర్థవంతంగా జనగణన నిర్వహించాలి
- తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీఓ ప్రసాద్
దండేపల్లి, ఆంధ్రప్రభ:
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జనగణన (సెన్సస్) ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని దండేపల్లి తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీఓ ప్రసాద్‌లు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. సోమవారం మండల పరిధిలో జనగణన విధుల్లో ఉన్న సిబ్బందిని వారు క్షేత్రస్థాయిలో కలిసి, పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఆవాస ప్రాంతంలో జనగణన పక్కాగా జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న సమయంలో ఒక్క ఇంటిని కూడా వదలకుండా, ప్రతి కుటుంబానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో గణన సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల నుండి సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తప్పుల్లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.
జనగణన నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను, సందేహాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భూమన్న, ఏఎస్‌ఓ రమేష్, సూపర్వైజర్ రాజన్న, గణన సిబ్బంది నర్సయ్య మరియు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
