ADB | అన్ని వాహనాల రాకపోకలకు అనుమతించాలి..
జన్నారం, జనవరి 31 (ఆంధ్రప్రభ) : ఉమ్మడి జిల్లాలోని కవ్వాల అభయారణ్యం జన్నారం డివిజనల్ పరిధిలోని టైగర్ జోన్ నిబంధనలు ఎత్తివేసి, అన్ని రకాల వాహనాల రాకపోకలకు అన్నివేళల్లో అనుమతించాలని అఖిలపక్ష కమిటి నేతలు తెలిపారు. మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో శుక్రవారం మధ్యాహ్నం టైగర్ జోన్ లోని ఆంక్షలు ఎత్తివేయాలని అఖిలపక్ష కమిటి ఆధ్వర్యంలో సమావేశం నిర్ణయించి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ… టైగర్ జోనుతో ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. లక్షేటిపేట, దండేపల్లి, జన్నారం మీదుగా ఖానాపూర్, ఉట్నూర్ మండలాలకు అన్ని వేళల్లో భారీ వాహనాల రాకపోకలకు అనుమతించాలన్నారు. స్థానికేతర అన్ని వాహనాలకు వసూలు చేస్తున్న రుసుమును రద్దు చేయాలని, గతంలో ఉన్న ఉత్తరువులను కఠినతరం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అనాదిగా అడవులకు సమీపాన ఉన్న ప్రజలను పెద్దపులులు లేని ప్రాంతంలో కవ్వాల అభయారణ్యం ఏర్పాటు చేసి, ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. అభయారణ్యం పరిధిలోని ముత్యంపేట, తపాల్ పూర్, ఇందనపల్లి, కలమడుగు, పాండ్వాపూర్, కొత్తగూడెం అటవీ శాఖ చెక్ పోస్టుల్లో వచ్చి, పోయే వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇటీవల తపాల్ పూర్ అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద జన్నారంకు చెందిన మోబిన్ మంచిర్యాల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఓ అటవీ బీట్ అధికారి కొట్టి ఇబ్బందులకు గురి చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
టైగర్ జోన్ ఎత్తివేసే వరకు అంచెలంచెలుగా ఆందోళనలు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష కమిటి నేతలు భూమాచారి, ఎం.డి రియాజోద్దీన్, సోహెల్ షా, ఎం.రాజశేఖర్, సుభాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఫసిహుల్ల, సతీష్, అజ్మత్ ఖాన్, ఫజల్ ఖాన్, జనార్ధన్, రియాసత్, రజాక్, రాజేశ్వర్, మున్వర్ అలీ, వామన్, సందీప్, భరత్ కుమార్, ఇందయ్య, కె.మహేష్, అశోక్, లింగన్న, తదితరులు పాల్గొన్నారు.