మొక్కలు నాటి సంరక్షించండి: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. పచ్చదనం పెరగడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్య నివారణ కూడా సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

నందిగామ మున్సిపాలిటీ 7వ వార్డు కొత్త బస్టాండ్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నాయకులతో కలిసి బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించి హరిత విప్లవంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పచ్చదనం పెరగడం వల్ల కాలుష్యం తగ్గి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

హనుమంతుపాలెం, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.

శివారు ప్రాంతమైన హనుమంతుపాలెంలో శనివారం నిర్వహించిన జన్మభూమి–మన ఊరు కార్యక్రమంలో భాగంగా మెయిన్ రోడ్డు నుంచి ఎన్‌ఎస్‌పీ కాలువ వరకు వెళ్లే డొంక రహదారికి ఇరువైపులా ఉన్న కంప చెట్ల తొలగింపు, రహదారి మరమ్మత్తుల పనులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలు నిత్యం ఉపయోగించే రహదారులను సురక్షితంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.

డొంక రహదారికి ఇరువైపులా పెరిగిన కంప చెట్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వెంటనే తొలగింపు, మరమ్మత్తుల పనులను ప్రారంభించామని చెప్పారు.

జన్మభూమి–మన ఊరు కార్యక్రమం ద్వారా గ్రామాల సమస్యలను నేరుగా గుర్తించి శాశ్వత పరిష్కారాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.