Iran Theo Crush : మరో విప్లవం Andhra Prabha SPL Analysis
Iran Theo Crush : మరో విప్లవం Andhra Prabha SPL Analysis
దైవపాలనకు తెర
హిజాబ్ పై నారీ భేరీ
రోజు రోజుకూ ప్రజాప్రతిఘటన
అమెరికా స్ట్రయిక్ వార్నింగ్
మరో వైపు బిట్రన్ ..జర్మనీ
బాహ్యప్రపంచంతో తెగతెంపులు
ఇంటర్నెట్ బంద్
విమానాలు నిలిపివేత
ఇరాన్ గగనతలం మూసివేత
( ఆంధ్రప్రభ, ఎనాలిసిస్ వింగ్ )
ఇరాన్ కాష్టం రగులుతోంది. పాలకుల నియంతృత్వ దొరణి ప్రజల్లో వ్యతిరేకతను రాజేస్తే.. అణచివేత.. ఉక్కుపాదం.. దమనకాండను జనం సహించటం లేదు. ప్రాణాలొడ్డి మరీ డిక్టేటర్ నశించాలని నినదిస్తున్నారు. మరో వైపు సైనిక దాడితో వెనిజులాను హస్తగతం చేసుకున్న ..అమెరికా తాజాగా ఇరాన్ పై కాలుదువ్వుతోంది.

ఇరాన్ ఆందోళనకారులకు మద్దతు పేరిట రంకెలు వేస్తోంది. మరో పక్కన బ్రిటన్, జర్మనీ దేశాలు దాడులకు దిగే అవకాశం ఉందని అనుమానించిన ఇరాన్ తన గగన తలాన్ని నిలిపివేసింది. ఏ క్షణంలోనైనా ఇరాన్ పై బాంబుల వర్షం తథ్యమని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

టెన్షన్.. టెన్షన్ మేఘాలు.. వెనిజులా నుంచి ఇరాన్ కు మళ్లాయి. వెనిజులాపై సైనిక దాడితో దేశాలన్నీ అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో.. సభ్య ప్రపంచ దృష్టి ఇరాన్ వైపు మళ్లే వ్యూహాన్ని అమెరికా రచించినట్టు కమ్యూనిస్టు దేశాలు అభివర్ణిస్తున్నాయి. ఇక అమెరికా విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఇస్లాం విప్లవంతో ప్రజాస్వామ్యాన్ని తరిమికొట్టిన ఇరాన్.. ప్రస్తుత పరిస్థితి ఏమిటీ? అసలు ఈ ఆందోళనకు అసలు కారణమేంటీ?

అంతు తెగని ఆర్థిక సంక్షోభం, తీవ్ర ద్రవ్యోల్బణంతో ఇరాన్ ఆర్థిక పతనావస్థకు చేరుకోగా.. ఆకలి, ఉపాధి, మితిమీరిన పాలకుల ఆంక్షలను తట్టుకోలేక ఇరాన్ ప్రజలు రోడ్డు ఎక్కారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనలు ఉధృతమయ్యాయి. గడచిన రెండు వారాల్లో 116 మంది నిరసనకారులు మరణించారు . 2,600 మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. అశాంతి చెలరేగడంతో ఇరాన్‌లోని అన్ని ప్రావిన్సులలో 180 కి పైగా నగరాలకు నిరసనలు వ్యాపించాయి.
Iran Theo Crush : రగలిన జనం
ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరే నిరసనలు భిన్నంగా మారాయి. ప్రధానంగా ఆర్థిక పతనం ఒక కారణం కాగ.. తాజాగా రాజకీయ సంక్షోభంగా రూపాంతరం చెందాయి. కేవలం ఆర్థిక సమస్యలకే కాకుండా, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పై జనంలో తీవ్ర అసంతృప్తి పెరిగింది.

దశాబ్దాల తరబడి ఆర్థిక నిర్వహణ లోపం, విపరీత అవినీతితో సామాన్యుడి బతుకు భారమైంది. పౌర హక్కుల అణచివేత, ఇంటర్నెట్ సెన్సార్ షిప్, కఠిన మతపర ఆంక్షలు యువతలో ఆగ్రహాన్ని పెంచాయి. రోడ్డెక్కిన నిరసనకారులు ఎక్కడా తగ్గటం లేదు. “డిక్టేటర్ నశించాలి” (Death to the Dictator) అంటూ నినదిస్తున్నారు. టెహ్రాన్ గ్రాండ్ బజార్ సహా.. కీలక ప్రాంతాలు మూత పడ్డాయి. ఘర్షణల్లో ఇప్పటి వరకు దాదాపు 116 మంది మరణించినట్లు పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Iran Theo Crush : ఐఆర్జీసీ ఆగడం
రోజు రోజుకూ నగరాలకు విస్తరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచి వేయడానికి ప్రభుత్వం అత్యంత శక్తివంత రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) బలగాలను రంగంలోకి దించింది. గత 15 రోజుల్లో ఐఆర్జీసీ దూకుడులో 116 మంది నిరసనకారులు మరణించారు . 2,600 మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది.

క్షతగాత్రులు, మృతదేహాలతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఒకదానిపై మరొక శవం పేరుకుపోయాయని నిరసనకారులు చెబుతున్నారు. బయటి ప్రపంచానికి సమాచారం అందకుండా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ విధించారు. కానీ నిరసనకారుల దూకుడు తగ్గలేదు.
నిరసనకారులను “విదేశీ ఏజెంట్లు” “టెర్రరిస్టులు” అని సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ముద్ర వేస్తున్నారు. అణచివేతకు వ్యతిరేకంగా కొంతమంది భద్రతా సిబ్బంది కూడా నిరసనకారులపై కాల్పులు జరపడానికి నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Iran Theo Crush : గగతనంలో ఇరాన్ అప్రమత్తం
ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నిరసనలకు వ్యతిరేకంగా , భద్రతా దళాలు హింసాత్మకంగా స్పందిస్తే ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా రిగణించింది.

బ్రిటన్, జర్మనీ దేశాలు కూడా ఇరాన్ గగనతలంలో సైనిక చర్యలు జరిగే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతంలో విమానాలు నడపవద్దని హెచ్చరికలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి. Flydubai దాదాపు 17 విమానాలను రద్దు చేయగా, Emirates , Qatar Airways కూడా తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి.

టెహ్రాన్, మషద్ నగరాలకు వెళ్లే డజన్ల కొద్దీ విమానాలను Turkish Airlines, AJet , Pegasus ఎయిర్ లైన్స్ రద్దు చేశాయి. Austrian Airlines వియన్నా -టెహ్రాన్ సర్వీసును రద్దు చేయగా, Lufthansa జనవరి 16 తర్వాతే సర్వీసులను పునరుద్ధరించే ఆలోచనలో ఉంది. ఇరాన్ దేశీయ విమాన సంస్థలు (Iran Air, Mahan Air) మాత్రం ప్రస్తుతం సేవలను కొనసాగిస్తున్నాయి.
Iran Theo Crush : ఆర్థిక పతనం మరో కారణం
సామాన్యుల అవసరాల కంటే అణు కార్యక్రమాలు, విదేశీ సాయుధ గ్రూపులకే ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోందని ప్రజలు భావిస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా పతనం అంచున ఉంది: ఇరాన్ కరెన్సీ ‘రియల్’ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌కు దాదాపు 1.4 నుంచి 1.5 మిలియన్ రియల్స్ పలుకుతోంది.

అధికారిక గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం 42% నుంచి 52% మధ్య ఉంది. పాలు, చికెన్ వంటి నిత్యావసరాల ధరలు ఏడాదిలో 6 నుండి 10 రెట్లు పెరిగాయి. వేతనాలు పెరగక పోవడం, పొదుపు చేసుకున్న సొమ్ము విలువ కోల్పోవడంతో మధ్యతరగతి ప్రజలు కూడా రోడ్లపైకి వస్తున్నారు.
Iran Theo Crush : మరో విప్లవానికి నాంది
ఇరాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది. 47 ఏళ్ల తర్వాత ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. విప్లవంతో ఏర్పడిన ‘దైవ పరిపాలన’ (Theocracy) ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతోంది. 1979లో విప్లవం తొలి రోజుల్లో ప్రజల మద్దతు ఉండేది.

కానీ నేడు, యువత మధ్యతరగతి ప్రజలు ఈ వ్యవస్థను ఒక “క్రిమినల్ వ్యవస్థ”గా భావిస్తున్నారు. “ఈ వ్యవస్థ 47 ఏళ్లుగా మా భవిష్యత్తును బందీగా ఉంచింది” అని నిరసనకారులు నినదిస్తున్నారు. నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం ‘మహారెబ్’ (దేవునికి వ్యతిరేకి) వంటి మతపర ఆరోపణలతో ఉరిశిక్షలను విధిస్తోంది. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి , అమెరికా వంటి దేశాలు ఇరాన్‌పై తిరిగి ఆంక్షలు విధించాయి. దీనివల్ల చమురు ఆదాయం తగ్గి, దేశం మరింత పేదరికంలోకి కూరుకుపోయింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత నిరసనలు ఇస్లామిక్ రిపబ్లిక్ మనుగడకే ప్రమాదకరంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2027 నాటికి ఇరాన్‌లో పెద్ద రాజకీయ మార్పు సంభవించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Iran Theo Crush : హిజాబ్ ప్రతిఘటన
ప్రభుత్వం బలవంతంగా అమలు చేస్తున్న హిజాబ్ చట్టాలు , ఇతర మతపర కట్టుబాట్లు యువతకు, ముఖ్యంగా మహిళలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఇరాన్‌లో, 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత హిజాబ్ (తల కప్పుకోవడం) ధరించడం మహిళలందరికీ తప్పనిసరి (mandatory) చట్టమైంది. ఈ ఆంక్షలు కేవలం మతపరమైనవి మాత్రమే కాకుండా, ప్రభుత్వ రాజకీయ నియంత్రణకు చిహ్నంగా మారాయి.

2026 నాటికి ఈ ఆంక్షల తీవ్రంగా మారాయి. ఇరాన్ చట్టాల ప్రకారం, మహిళలు బహిరంగ ప్రదేశాలలో శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలి. ముఖం, చేతులు (మణికట్టు నుండి వేళ్ల వరకు) మినహా శరీరం మొత్తం ముసుగువేయాలి. లోపలి భాగం కనిపించని, వదులుగా ఉండే పొడవాటి కోటు లేదా మాంటో (manteau) ధరించాలి. బిగుతైన లేదా పారదర్శక దుస్తులు నిషేధం. తల కప్పుకోవడానికి స్కార్ఫ్, షైలా లేదా చాదర్ (పూర్తి శరీరాన్ని కప్పే వస్త్రం) ఉపయోగించాలి. ఈ చట్టాలు 9 సంవత్సరాలు పైబడిన బాలికలకు కూడా వర్తిస్తాయి.

హిజాబ్ ఆంక్షలను అమలు చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది . “నైతికత పోలీసులు” (Morality Police) బహిరంగ ప్రదేశాలలో మహిళలు సరైన హిజాబ్ ధరించారా లేదా అని తనిఖీ చేస్తారు. మహ్సా అమిని మరణం తర్వాత, చాలా మంది మహిళలు ప్రభుత్వ ఆంక్షలకు వ్యతిరేకంగా బహిరంగంగా హిజాబ్ ధరించకుండా నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం అణచివేతను పెంచుతున్నప్పటికీ, మహిళల ప్రతిఘటన కొనసాగుతూనే ఉంది.
