ఆంగ్ల ఉపాధ్యాయుడికి అంతర్జాతీయ అచీవర్స్ అవార్డు

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ముప్పై ఏళ్లుగా ఆంగ్ల బోధనలో విశేష సేవలు అందిస్తున్న తెలంగాణ మోడల్ స్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు కందగట్ల గణేష్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ ఆంగ్ల భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్థాన్‌లోని కోటలో జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డును ప్రకటించారు. గురువారం వెల్దిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాలకుర్తి శ్రీధర్ చేతుల మీదుగా గణేష్ ఈ అవార్డును అందుకున్నారు.
గణేష్ తన బోధనలో వినూత్న పద్ధతులను అనుసరిస్తూ విద్యార్థులలో ఆంగ్ల భాషా పట్ల ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలోనూ ఆయనకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో విద్యా రత్న, గురు రత్న, ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు ముఖ్యమైనవి. అంతేకాకుండా, నైజీరియాకు చెందిన అంతర్జాతీయ ఆన్‌లైన్ విద్యా సదస్సు, ఏ వాక్ త్రూ ఎడ్యుకేషన్(ఏ డబ్ల్యూటిఇ) లో వక్తగా పాల్గొంటూ తన ప్రతిభను అంతర్జాతీయ వేదికపై చాటుకుంటున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్, తోటి ఉపాధ్యాయులు గణేష్ కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ తన ఎదుగుదలకు సహకరించిన ప్రిన్సిపల్కి, తోటి ఉపాధ్యాయులకు, కుటుంబ సభ్యులకు, నిత్యం నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చే విద్యార్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ గడ్డం జయశ్రీతో పాటు ఉపాధ్యాయులు రవి, శశికుమారి, సురేఖ, రాజు, మల్లం శ్రీధర్, సౌజన్యప్రియ, పార్వతి, వినీల, రుద్రమదేవి, షహానా, మాలతి, శ్రీను, మోహన్ రావు, వసంత మాధురి, లలిత, అమనగంటి బాలరాజు, రాజయ్య, వెనిల్ తదితరులు పాల్గొన్నారు.
