ఎంఎస్ఎంఈలకు కేంద్రం చేయూత…

ఎంఎస్ఎంఈలకు కేంద్రం చేయూత…
పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..
ఏపీలో 6.37 లక్షల మందికి లబ్ధి…
లోక్‌సభలో ఎంపీ చిన్ని ప్రశ్నకు కేంద్రం సమాధానం
విజయవాడ, ఆంధ్రప్రభ : చిన్న, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా బలపరిచే పథకాలపై లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ఎంఎస్ఎంఈలకు ఊరట కలిగించేలా పలు పథకాలను అమలు చేస్తున్నామని, ముఖ్యంగా ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
దీనివల్ల చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లు, స్వయం ఉపాధి దారులకు సులభంగా రుణాలు అందుతున్నాయని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6.37 లక్షల మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న వ్యాపార రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొంది.
రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్ఎంఈ రుణాల కోసం దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కేంద్రం అంచనా వేసింది. ఈ చర్యలు ఉపాధి అవకాశాల పెంపుతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని అధికారులు తెలిపారు.
