India-Myanmar bilateral relations | మయన్మార్ అధ్యక్షుడితో ప్రధాని కీలక భేటీ..

India-Myanmar bilateral relations | మయన్మార్ అధ్యక్షుడితో ప్రధాని కీలక భేటీ..

  • ద్వైపాక్షిక బంధాలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు!

భారత పర్యటనలో ఉన్న మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. మయన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి విదేశీ పర్యటన కోసం భారతదేశాన్ని ఎంచుకోవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వివిధ కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించే అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.

మయన్మార్ అధ్యక్షుడు తన భారత పర్యటనను బోధ్‌గయలో భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో ప్రారంభించడం విశేషం. ఈ అంశాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధానికి నిదర్శనమని, భారతీయులందరికీ ఇది ఎంతో సంతోషాన్ని కలిగించే విషయమని కొనియాడారు.

భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘నేబర్‌హుడ్ ఫస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’, ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక విధానాల్లో మయన్మార్ అత్యంత కీలకమైన భాగస్వామి అని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భారత్-మయన్మార్ సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు సమగ్ర సమీక్ష జరిపిన‌ట్టు ప్ర‌దాని మోదీ తెలిపారు.

పలు కీలక రంగాల్లో సహకారంపై విస్తృత చర్చలు..

భారత్, మయన్మార్ మధ్య బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు పలు రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు, ఆధునిక సాంకేతికతకు ఎంతో కీలకమైన రేర్ ఎర్త్స్ (Rare Earths) రంగంలో పరస్పర సహకారంపై ప్రత్యేకంగా చర్చించారు.

ఇరు దేశాల సరిహద్దు కనెక్టివిటీని మెరుగుపరచడం, హెల్త్‌కేర్ (ఆరోగ్య సంరక్షణ), సామర్థ్య పెంపుదల (Capacity Building), చారిత్రాత్మక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ (Heritage Restoration) వంటి అంశాలపై కార్యాచరణను సమీక్షించారు. ప్రాంతీయ స్థిరత్వమే లక్ష్యంగా అంత్యంత కీలకమైన సముద్ర తీర భద్రత (Maritime Security), సైబర్ సెక్యూరిటీ వంటి రక్షణ రంగ అంశాలలో ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి.