ఆకట్టుకున్న ఏసుక్రీస్తు సిలువ వేసే సన్నివేశం

ఖమ్మం కల్చరల్, ఆంధ్రప్రభ ; ప్రజలందరిలో వసుదైక కుటుంబం అనే భావన వెల్లి విరియాలని ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్ సి ఎం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ తెలియజేశారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని శుక్రవారం ఖమ్మం నగరంలోని వైరా రోడ్డు లో ఉన్న నార్త్ ప్యారిస్ సెయింట్ ముజ్జకొని చర్చ్ నుంచి ప్రారంభమైన సిలువ యాత్రను బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ మాట్లాడుతూ సర్వ మానవాళిని పాపాల నుంచి రక్షించడానికి ఏసుప్రభు సిలువ మోసారని కఠినమైన శ్రమలను అనుభవించారని తెలిపారు.

దైవ కుమారుడైనప్పటికీ క్రీస్తు ప్రభువు ఎన్నో కష్టాలతో బాధింపబడి జనుల రక్షణ కోసం ప్రాణాలర్పించి , క్షమాపణ పంచి త్యాగము చేసిన వ్యక్తి ఏసుప్రభు అని తెలిపారు. బడుగు బలహీన కుటుంబాలకు వెలుగులు నింపి అందరికీ పరలోక దీవెనలు పంచిన దైవ కుమారుడు లోక రక్షకుడు అని తెలియజేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింప చేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పెద్ద మనసుతో తమ తీర్పును పునః సమీక్షించుకోవాలని కోరారు.

ఖమ్మం వైరా రోడ్ ఆర్ సి ఎం చర్చి నుంచి ప్రత్యేక వాహనంలో సిలువ ధారణ సన్నివేశాలను ప్రదర్శిస్తూ సిలువయాత్ర నిర్వహించారు. 40 రోజులు ఉపవాస దీక్షలో ఉన్న యువకుడు నవీన్ ను ఏసుప్రభు వేషధారణలో సిలువపై ఉంచి భటులు విపరీతంగా కొట్టే సన్నివేశాలను ప్రదర్శించగా మహిళా భక్తులు బోరున రోదించారు.

దాదాపు 5000 మంది భక్తులతో ఎనిమిది కిలోమీటర్లు ఆధ్యాత్మిక గేయాలతో, భక్తి ఉపన్యాసాలతో నార్త్ ప్యారిస్ చర్చి నుంచి సిలువయాత్ర వైరా రోడ్డు అంబేద్కర్ సెంటర్ , ఇల్లందు క్రాస్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, కొత్త బస్టాండ్ రోడ్డు, రాపర్తి నగర్ రోడ్డు, ఓవర్ బ్రిడ్జి మీదగా కరుణగిరి పుణ్యక్షేత్రానికి చేరుకుంది. కరుణగిరి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత గురువులు ఫాదర్ సూరేపల్లి ఐజక్, ఫాదర్ విజయ్ కుమార్, ఫాదర్ జి సురేష్, ఫాదర్ జ్ఞానేష్, ఫాదర్ జయరాజు, ఫాదర్ గోవా శౌరయ్య, ఫాదర్ ఏసు రాజు, ఫాదర్ జోసెఫ్, ఫాదర్ రాజు, ఫాదర్ టి ఆంటోనీ, కొమ్ము ప్రసాద్, ముత్తమాల ప్రసాద్,బ్రదర్స్, సిస్టర్స్, పలు ఆర్.సి.యం చర్చ్ ల సంఘస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.