Immigration | గ్రీన్ కార్డు కావాలంటే స్వదేశానికి వెళ్లాల్సిందే..

Immigration | గ్రీన్ కార్డు కావాలంటే స్వదేశానికి వెళ్లాల్సిందే..
Immigration | అక్కడ ఇంటర్వ్యూలో సక్సెస్ అయితేనే స్టాంపింగ్
స్వదేశానికి వచ్చేయడమే బెటర్ అంటున్న భారతీయలు
Immigration | వాషింగ్టన్ , ఆంధ్రప్రభ : అమెరికాలో స్థిరపడాలని, గ్రీన్ కార్డ్ సాధించాలని కలలుగనే లక్షలాది మంది భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు యూఎస్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఒక కొత్త పాలసీ మెమోను విడుదల చేసింది. దీని ప్రకారం, అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ కోసం స్టేటస్ మార్చుకునే సదుపాయం ఇకపై అంత సులువు కాదు. అత్యధిక సందర్భాల్లో విదేశీయులు తమ సొంత దేశానికి వెళ్లి, అక్కడి కాన్సులేట్ ద్వారానే గ్రీన్ కార్డ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే గ్రీన్ కార్డ్ కావాలనుకునే భారతీయులు ఇకపై అమెరికా వదిలి స్వదేశానికి వచ్చి ఇంటర్వ్యూలు పూర్తి చేయాల్సి రావచ్చు.
నిబంధనలు కఠినం
అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. టూరిస్ట్, స్టూడెంట్ (F-1), లేదా తాత్కాలిక వర్క్ వీసా (H-1B) లపై వచ్చే వారు ఒక నిర్దిష్ట కాలపరిమితి కోసం మాత్రమే దేశంలోకి అడుగుపెడతారు. కానీ, చాలామంది అమెరికాలో లీగల్ లూప్‌హోల్స్ వాడుకుంటూ అక్కడే ఉండి గ్రీన్ కార్డ్‌కు అప్లై చేస్తున్నారు. దీనివల్ల వీసా గడువు ముగిసినా చాలా మంది దొంగచాటుగా అమెరికాలోనే ఉండిపోతున్నారని యూఎస్ అధికారులు గుర్తించారు. ఈ లూప్‌హోల్స్‌కు అడ్డుకట్ట వేయడానికే తాము చట్టాన్ని దాని అసలు రూపంలోకి తెస్తున్నామనియూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ స్పష్టం చేశారు. మినహాయింపులు ఉన్నప్పటికీ, సాధారణంగా అందరూ స్వదేశానికి వెళ్లాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
అంతా అధికారుల చేతుల్లోనే..
ఈ కొత్త నిర్ణయం వల్ల అమెరికాలో కష్టపడి పనిచేస్తున్న హెచ్-1బీ ప్రొఫెషనల్స్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటివరకు తాము లీగల్ స్టేటస్ పాటిస్తూ, సకాలంలో ట్యాక్సులు కడుతూ, అర్హతలన్నీ ఉంటే గ్రీన్ కార్డ్ సులభంగా వచ్చేస్తుందని భారతీయ ఐటీ ఉద్యోగులు భావించేవారు. కానీ తాజా ఫుట్‌నోట్ ప్రకారం.. కేవలం H-1B లేదా L-1 వీసా కలిగి ఉండటం మాత్రమే గ్రీన్ కార్డ్ ఆమోదానికి గ్యారెంటీ కాదు. ఇకపై గ్రీన్ కార్డ్ ఆఫీసర్లు తమకు ఉన్న విచక్షణాధికారాలను ఎక్కువగా వాడనున్నారు. అంటే, దరఖాస్తుదారుడికి అర్హత ఉన్నప్పటికీ, అతనికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా ఆ అధికారి మూడ్‌పై, వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
కాస్త ఊరట…
అయితే, ఎన్నో ఏళ్లుగా EB-2, EB-3 వీసా క్యూలో వేచి చూస్తున్న భారతీయ కుటుంబాలకు ఇందులో ఒక చిన్న ఊరట లభించే అవకాశం కూడా ఉంది. ఎవరైతే 10 నుంచి 15 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారో, వారికి ఈ నిబంధన కలిసి రావచ్చు. గ్రీన్ కార్డ్ అధికారులు అప్లికేషన్లను పరిశీలించేటప్పుడు దరఖాస్తుదారుడి పాజిటివ్ పాయింట్స్ పరిగణనలోకి తీసుకుంటారు. అంటే మీరు అమెరికాలో చేసిన మంచి పనులు, మీ ట్యాక్స్ హిస్టరీ, కెరీర్‌లో సాధించిన విజయాలు, స్థానిక సమాజంలో మీ భాగస్వామ్యం, మీ కుటుంబ బంధాలను వివరంగా సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ బాగుంటే ఆఫీసర్లు తమ విచక్షణాధికారంతో అమెరికాలోనే గ్రీన్ కార్డ్ అప్రూవ్ చేయవచ్చు.
ఎఫ్ 1 వీసాలకు గడ్డుకాలమే…
మరోవైపు, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఎఫ్-1 వీసా విద్యార్థులకు ఈ రూల్స్ మరింత అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఎందుకంటే ఎఫ్-1 అనేది డ్యూయల్ ఇంటెంట్ (అటు చదువు, ఇటు వలస) ఉన్న వీసా కాదు. విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలో చదువు పూర్తి కాగానే ఇండియా వచ్చేస్తాను అని చెప్పి అమెరికా వెళ్తారు. ఒకవేళ వారు చదువు పూర్తి కాకముందే లేదా పూర్తి కాగానే అక్కడే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తే, నాడు చెప్పిన మాటపై మీరు ఎంతవరకు నిలబడ్డారు? అని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. దీనివల్ల విద్యార్థుల అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. మొత్తమ్మీద, గ్రీన్ కార్డ్ సాధన అనేది భారతీయులకు ఇకపై కత్తిమీద సామే కానుంది.
CLICK HERE TO READ Ap Cm Serious : గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ Andhra Prabha Top Story
